విజయవాడ, జూన్ 26: గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను “భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుపై జరిగిన అత్యంత ఘోర దాడి”గా అభివర్ణించిన కమిషన్, ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), విజయవాడ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో కీలకమైన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ డిలీట్ అయినట్లు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఆ ఫుటేజీని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రికవరీ చేసి భద్రపరచాలని అధికారులను ఆదేశించింది. దర్యాప్తుకు అవసరమైన అన్ని డిజిటల్ ఆధారాలను పరిరక్షించాలని స్పష్టం చేసింది. అంతేకాక, సాయికృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, బాధితుడి అస్థికలను గుర్తించి వెలికితీయాలని, వాటిని శాస్త్రీయ పరీక్షలకు పంపించి సాక్ష్యాలను భద్రపరచాలని కూడా కమిషన్ ఆదేశించింది.
ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రాథమిక విచారణలో ఇది కస్టడీ మరణం అయ్యి ఉండొచ్చని కోర్టుకు నివేదించగా, ఒక పోలీసు అధికారి న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ అదృశ్యం కావడం, ఆధారాల ధ్వంసంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం కేసుకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.