జనగణమన దినపత్రిక

మహిళా నేతలపై దాడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

- రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారు: కేటీఆర్

1

జనగణమన బ్యూరో – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. క్రిమినల్ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి తెలంగాణకు రావడం ప్రజల దురదృష్టకరమని ఆయన విమర్శించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై అత్యంత హేయమైన రీతిలో దాడి జరిగిందని ఆరోపించారు. మహిళా నాయకురాళ్లను చుట్టుముట్టి లాగడం, గొంతు పట్టుకోవడం, చీర లాగడం వంటి ఘటనలతో ‘దుశ్శాసన పర్వానికి’ కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా నేతలపై జరిగిన అవమానానికి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు

ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. స్పీకర్‌ను ఉద్దేశించి తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్సీ ఇప్పటికే స్పష్టం చేశారని, స్పీకర్ బాధపడి ఉంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకుని విచారం కూడా వ్యక్తం చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎమ్మెల్సీలపై చర్యలకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం, బహిష్కరించడం ద్వారా వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అరెస్టు చేయడంపైనా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

కేసీఆర్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఆగ్రహం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ గూండాలను పోలీసు ఎస్కార్ట్‌తో పంపిన ప్రభుత్వం, కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన కేసీఆర్ ఎందుకు చావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా సుమారు 70 లక్షల మంది రైతులకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేసిందని అన్నారు.

‘కాంగ్రెస్ మేనిఫెస్టోనే అసలు టార్గెట్’

కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా కేటీఆర్ అభివర్ణించారు. 420 హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, రైతులకు రూ.15,000 రైతు భరోసా, రైతు కూలీలు, కౌలు రైతులు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.4,000 భృతి వంటి హామీలపై తెలంగాణ యువతకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని అన్నారు. స్కూటీల హామీ ఏమైందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదలు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తమను, ఎమ్మెల్సీలను టార్గెట్ చేయడం కంటే కాంగ్రెస్ మేనిఫెస్టోను టార్గెట్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ప్రశ్నలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి, మూడేళ్లు దాటినా అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

సాగునీటి అంశంలో ప్రభుత్వ వైఫల్యం

కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ వ్యవహారాల్లో తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని విమర్శించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు వెంటనే నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 510 అడుగుల నీటిమట్టం ఉన్న సమయంలో కూడా సాగర్ నుంచి నీటిని అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం 530 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ సాగర్ ఆయకట్టు రైతులకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కన్నెపల్లి పంపులు ఎప్పుడు ఆన్ చేస్తారో, కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు వస్తాయో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై క్షుద్ర రాజకీయాలను పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టును వినియోగించాలని సూచించారు.

పెండింగ్ సమస్యలపై చర్చకు డిమాండ్

కోటి ఎకరాలకు సంబంధించిన నిషేధిత జాబితా భూముల సమస్య, విద్యార్థులకు సంబంధించిన రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తలతో తమపై దాడి చేయించే ప్రయత్నం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. పోలీసు యంత్రాంగం ఆదేశాలను గౌరవిస్తూ ఉన్న తమపై పోలీస్ స్టేషన్‌లోనే దౌర్జన్యానికి ప్రయత్నించడం దారుణమన్నారు.

‘823 రోజులు కాంగ్రెస్‌ను వదిలిపెట్టం’

రాజ్యాంగం, చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి గౌరవం లేదని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మిగిలి ఉన్న 823 రోజుల పాలనలో ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ముఖ్యంగా సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలపై జరిగిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా నాయకురాళ్లను అవమానించిన ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.