శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది
- బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
జనగణమన బ్యూరో – హైదరాబాద్: శాసనసభలో చర్చలు జరిగిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం సభా సంప్రదాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాతే సభ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. చర్చ జరగకుండానే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక వారి “చీకటి మిత్రులను” కాపాడాలనే ప్రయత్నం ఉందని విమర్శించారు. శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇదే సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించి విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి అయినా, సాధారణ శాసనసభ్యుడైనా స్పీకర్ ముందు సమానమేనని పేర్కొన్నారు.
స్పీకర్ పదవి అత్యున్నతమైనది
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మనసు గాయపడేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇది వ్యక్తిగతంగా గడ్డం ప్రసాద్‌కుమార్‌కు జరిగిన ఘటనగా చూడకూడదని, స్పీకర్ పదవికి జరిగిన అవమానంగా భావించాలని అన్నారు. సభాపతిని గౌరవించడం తెలంగాణ శాసనసభ సంప్రదాయమని పేర్కొన్నారు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా సభ్య సమాజం తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ ఘటన సభ గౌరవానికి సంబంధించిన అంశం కావడంతో సభ్యులు దీనిపై చర్చ చేపట్టారని తెలిపారు. భవిష్యత్ తరాలు శాసనసభ నుంచి నేర్చుకునేలా సభ్యుల వ్యవహారశైలి ఉండాలని సూచించారు.
“తెలంగాణ ప్రజలకు అవమానం”
స్పీకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడటం క్షమించరాని నేరమని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది కేవలం దళితులకు జరిగిన అవమానం కాదని, తెలంగాణ సమాజం మొత్తానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ గత పాలనలో దళితులకు ఇచ్చిన హామీలను కూడా సీఎం ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, దళితబంధు అమలు చేస్తామని హామీలు ఇచ్చారని విమర్శించారు. దళిత ఉప ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. నేరెళ్ల ఘటనను ప్రస్తావిస్తూ.. ఇసుక లారీలను అడ్డుకున్న దళితులపై లారీలతో తొక్కించి చంపారని సీఎం ఆరోపించారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారని విమర్శించారు. బీఆర్ఎస్‌ది దళిత వ్యతిరేక ఆలోచన, దళిత వ్యతిరేక వైఖరి అని అన్నారు.
“అదిరించి బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకోలేరు”
ప్రభుత్వం సంయమనం పాటిస్తే దాన్ని చేతకానితనంగా భావిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
సభా నాయకుడిగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడితో రాజీనామా చేయించాలని, అలాంటి వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. “సభ గౌరవం, స్పీకర్ పదవి గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అంతకు ముందు సీఎం వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో కలిసి అల్పాహారం చేశారు.