మెగా గ్రోత్ కారిడార్లు గా వరంగల్, కరీంనగర్ & ఖమ్మం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను మెగా గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వరంగల్ , కరీంనగర్ మరియు ఖమ్మం నగరాల చుట్టూ ఆర్థికాభివృద్ధి, రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక విస్తరణకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్లు (ORR) నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నగరాల భవిష్యత్ అవసరాలు, ట్రాఫిక్ ఒత్తిడి, పట్టణ విస్తరణ, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూభాగాలపై చర్చించినట్లు తెలిసింది. ORR నిర్మాణం పూర్తయితే నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు శివారు ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు నివేదించారు.

ప్రత్యేకంగా వరంగల్ నగరాన్ని ఐటీ, విద్యా కేంద్రంగా, కరీంనగర్ వాణిజ్య, వ్యవసాయ ఆధారిత హబ్‌గా, ఖమ్మంను పారిశ్రామిక, రవాణా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ORRలతో పాటు రింగ్ రోడ్లకు అనుసంధానంగా కొత్త టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్ పార్కులు, ఇండస్ట్రియల్ జోన్లు, ఐటీ పార్కులు, హౌసింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రాంతీయ సమతుల అభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.