జనగణమన దినపత్రిక

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సమగ్ర ఫ్రేమ్‌వర్క్

- న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడమే: సీఎం రేవంత్‌రెడ్డి

3

జనగణమన బ్యూరో – హైదరాబాద్: పిల్లల ఆన్‌లైన్‌ భద్రత కోసం తెలంగాణ హైకోర్టు, టీజీఎస్‌-ఎల్‌ఎస్‌ఏతో కలిసి సమగ్ర చైల్డ్‌ ఆన్‌లైన్‌ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సంబంధిత శాఖలను ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (NALSA) దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో సీఎం మాట్లాడారు. పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరాల నుంచి వారిని రక్షించడం అత్యంత కీలకమన్నారు. ఇంటర్నెట్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్నో ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ.. ఏది నిజం, ఏది ప్రమాదకరమో గుర్తించే సామర్థ్యం పిల్లలకు ఎల్లప్పుడూ ఉండకపోవచ్చని తెలిపారు. చిన్న పొరపాట్లు కూడా పిల్లలు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

మహాత్మా గాంధీ న్యాయాన్ని పేదలు, బలహీనుల కోసం ఒక ఆయుధంగా ఉపయోగించారని, అదే స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదన్నారు.

మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యం

తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్లు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భరోసా కేంద్రాల్లో పోలీసు సహాయం, వైద్యం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సేవలను ఒకే చోట అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. SHE-భరోసా సైబర్‌ ల్యాబ్‌లతో పాటు CybHER యాప్‌ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులను సైబర్‌ అంబాసిడర్లుగా తీర్చిదిద్ది తోటి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు సీఎం పేర్కొన్నారు.

బాధితుల పునరావాసమే నిజమైన న్యాయం

బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన ఇతర సహకారం అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పారు. TGS-LSA, పాఠశాల విద్యాశాఖ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా ఉపాధ్యాయులు పిల్లలకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. “న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు. బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం, అతని గౌరవాన్ని పునరుద్ధరించడం. ముఖ్యంగా ఒక బిడ్డ కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం” అని సీఎం అన్నారు.

సైబర్‌ నేరాల కోసం 1930, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోసం 1098 నంబర్లను ప్రతి పిల్లవాడు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు.

NALSA దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో జరిగే చర్చలు, సిఫారసులు తెలంగాణతో పాటు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.