నేటి నుంచి ఆషాఢ బోనాలు – భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

రూ.20 కోట్లతో మూడు వేలకుపైగా దేవాలయాల్లో ఏర్పాట్లు ఏర్పాట్లు

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు గురువారం (జూలై 16) నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జంట నగరాల ప్రజలకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. బోనాల పండుగ కేవలం ఒక ఆచార సంప్రదాయ ఉత్సవం మాత్రమే కాదని, హైదరాబాద్ ప్రజల జీవన విధానాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే మహోత్సవమని సీఎం అన్నారు. ఈ పండుగ ద్వారా ప్రజల్లో భక్తి, సామరస్యం, పరస్పర గౌరవ భావాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకుపైగా దేవాలయాల్లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సంబంధిత శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాలయాల పరిసరాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించినట్లు తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో పాల్గొనే ఈ మహోత్సవం రాష్ట్ర లౌకిక స్ఫూర్తిని చాటుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పండుగ తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును ప్రపంచానికి చాటిచెబుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా, సంప్రదాయాలకు భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.