అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన
- తెలంగాణను 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం
హైదరాబాద్, జూలై 15: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం తెలంగాణకు మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించే మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” నిర్వహించిందని, 108 దేశాల నుంచి మూడు వేల మంది కార్పొరేట్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగిందన్నారు.
సీఎం మాట్లాడుతూ, “తెలంగాణ రైజింగ్-2047” విజన్ ప్రకారం 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వికసిత భారత్-2047 లక్ష్యంలో భాగంగా జాతీయ జీడీపీలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఈ లక్ష్య సాధనలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, వేగవంతమైన అనుమతులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమెజాన్ సంస్థ 2034 నాటికి తెలంగాణలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షించారు. అమెజాన్ పెట్టుబడుల పురోగతిపై ప్రతి నెల ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా పరిశ్రమలు, పర్యాటకం, ఇంధనం, ఆరోగ్యం, క్రీడల వంటి రంగాలకు ప్రత్యేక విధానాలు రూపొందించినట్లు తెలిపారు. యువతకు నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెడితే మరిన్ని కంపెనీలు కూడా తెలంగాణ వైపు ఆకర్షితులవుతాయని అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ, ఫార్మా పరిశ్రమలు, అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని, వారికి ఉపాధి అవకాశాలతో పాటు కాలుష్యరహిత జీవన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
నగరాభివృద్ధిలో భాగంగా పాత పరిశ్రమలను తరలించడం, మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులను దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, నగరంలోని డీజిల్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై పన్ను పూర్తిగా మినహాయించినట్లు, ఇందువల్ల ప్రభుత్వం ఏడాదికి రూ.1,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినా కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.
దేశంలోని ఇతర మహానగరాల్లో ఉన్న కాలుష్య సమస్యలు హైదరాబాద్‌లో తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న సీఎం, రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా విభజించి సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం, వారి త్యాగాన్ని ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆందోళనలు చేస్తున్న రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డికి సూచించారు. అమెజాన్ సంస్థ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించి భారీ పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.