జనగణమన దినపత్రిక

యాదాద్రి థర్మల్‌కు బొగ్గు కొరతపై సీఎం ఆగ్రహం

- దసరాలోపు పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయాలి: రేవంత్‌రెడ్డి

3

జనగణమన బ్యూరో – హైదరాబాద్: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరగకపోవడంపై అధికారులు వివరణ ఇవ్వాలని వారు ఆదేశించారు.

యాదాద్రి థర్మల్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి జీ-9 గ్రేడ్‌ బొగ్గు అవసరమని అధికారులు తెలిపారు. అయితే సింగరేణిలో జీ-9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ ఆ గ్రేడ్‌ బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం లేదని వివరించారు. జీ-9 బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతతో యాదాద్రి ప్లాంట్‌ను ఎలా నిర్మించారని సీఎం, డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.

బొగ్గు గనుల వద్దే విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించే ‘పిట్‌హెడ్‌’ విధానాన్ని కాకుండా, గనులకు దూరంగా యాదాద్రి ప్లాంట్‌ను ఎందుకు నిర్మించారని వారు ఆరా తీశారు. బొగ్గు రవాణా వల్ల రాష్ట్రంపై పడుతున్న అదనపు భారం ఎంత అని అధికారులను ప్రశ్నించారు. గతంలో రాజకీయ కారణాలతోనే ప్లాంట్‌ను పిట్‌హెడ్‌ వద్ద కాకుండా దూరంగా నిర్మించారని అధికారులు వివరించినట్లు సమాచారం. యాదాద్రికి బొగ్గు సరఫరా కారణంగా రాష్ట్రంపై సుమారు రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని వారు తెలిపారు.

సింగరేణి నుంచి జీ-9 బొగ్గు లభ్యతపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో సింగరేణి నుంచి జీ-9 బొగ్గు సరఫరా సాధ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్‌ (ఎంసీఎల్‌), కోల్‌ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డితో తక్షణమే చర్చించాలని భట్టి విక్రమార్కకు సీఎం సూచించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.