ఇరాన్ స్వాధీనం చేసుకున్న అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు వేలానికి!
- యుద్ధంలో మృతుల కుటుంబాలకు విక్రయ ఆదాయం.. ఎన్ని నౌకలు స్వాధీనం చేసుకున్నారో వెల్లడి చేయని ఇరాన్
జనగణమన సెంట్రల్ డెస్క్: ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధ సమయంలో స్వాధీనం చేసుకున్న అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు, వాటిలోని సరుకులను విక్రయానికి పెట్టనున్నట్లు ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇరాన్ న్యాయవాదుల కేంద్రం అధిపతి హసన్ అబ్దోలియాన్‌పూర్ మాట్లాడుతూ.. యుద్ధ సమయంలో స్వాధీనం చేసుకున్న నౌకలు, సరుకుల విక్రయానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విక్రయం ద్వారా సమకూరే నిధులను యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలకు అందించనున్నట్లు వివరించారు.
అయితే ఇరాన్ ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ని నౌకలను స్వాధీనం చేసుకున్నదనే విషయాన్ని అబ్దోలియాన్‌పూర్ వెల్లడించలేదు. అలాగే విక్రయాలు ఎప్పుడు, ఏ విధానంలో నిర్వహిస్తారనే దానిపై కూడా పూర్తి వివరాలు బయటకు రాలేదు.
యుద్ధం ఇంకా ముగియకముందే స్వాధీనం చేసుకున్న నౌకలు, సరుకుల విక్రయానికి చర్యలు ప్రారంభించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ ప్రక్రియను ‘లిక్విడేషన్ సేల్’గా పేర్కొంటున్నారు. యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి పరిణామాలపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.