జనగణమన దినపత్రిక

సంగారెడ్డిలో సీఎం వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్‌

- స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా సీఎం పచ్చి అబద్ధాలు: మాజీ మంత్రి

3

జనగణమన ప్రతినిధి – సంగారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని, మహనీయులను స్మరించుకోవాల్సిన రోజున ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలకు దిగడం దురదృష్టకరమని విమర్శించారు. సంగారెడ్డి సభలో సీఎం చేసిన పలు వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి సభలో సీఎం అభివృద్ధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్‌, రైతులు, విద్యార్థుల సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారని, సంగారెడ్డి సభలో సీఎం సరిగ్గా సాయంత్రం 4.20 గంటలకు ప్రసంగం ప్రారంభించి ‘420 మాటలు’ మాట్లాడారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సింగూరు నీటి పరిస్థితిపై విమర్శలు: మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు పరిస్థితిపై హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును ఖాళీ చేశారని, నారాయణఖేడ్‌ తదితర ప్రాంతాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. జహీరాబాద్‌కు ఏడాది క్రితం వచ్చిన సందర్భంగా సీఎం చేసిన హామీల్లో ఎన్ని అమలయ్యాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరైన మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు, రోడ్లకు మించి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఏం చేసిందో వివరించాలని ప్రశ్నించారు.

రేషన్‌ కార్డులు, ఉద్యోగాలపై భిన్న గణాంకాలంటూ ఆరోపణ: రేషన్‌ కార్డుల విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్‌ కార్డులు మంజూరు చేసి సుమారు 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యం, కుటుంబానికి 20 కిలోల పరిమితి ఉండేదని, కేసీఆర్‌ ప్రభుత్వం ఆ సీలింగ్‌ను ఎత్తివేసి కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందించిందని పేర్కొన్నారు.

ఉద్యోగాల విషయంలోనూ ప్రభుత్వం భిన్నమైన గణాంకాలు చెబుతోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్లు సమాధానం వచ్చిందని, అయితే సభల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెబుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించినందుకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రుణమాఫీపై సవాల్‌: రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టు పెట్టి హామీ ఇచ్చిన సీఎం, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని హరీశ్‌రావు ఆరోపించారు. రుణమాఫీకి రూ.35 వేల కోట్లు కేటాయించామని అసెంబ్లీలో చెప్పి, రూ.20 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన రూ.15 వేల కోట్ల పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, సీఎం తన సవాల్‌ను స్వీకరించి రుణమాఫీ జరగని రైతుల వద్దకు వచ్చి వాస్తవాలను పరిశీలించాలని అన్నారు. “గన్‌మెన్లను వదిలేసి నా వెంట నీ ఊరికి వస్తావా?” అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

రైతుబంధుపై లెక్కలు చెప్పిన హరీశ్‌రావు: రైతుబంధు విషయంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం 2022-23లో రూ.14,743 కోట్లు రైతుబంధుగా ఇచ్చిందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2024-25లో రూ.5,557 కోట్లు, 2025-26లో రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి సుమారు రూ.15 వేల కోట్లు రైతుబంధు కింద తగ్గించారని ఆరోపించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ రైతుబంధు ఇస్తున్నామని సీఎం చేస్తున్న ప్రకటనలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు.

ఉచిత విద్యుత్‌, ఎరువుల కొరతపైనా విమర్శలురైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. రాఘవాపూర్‌, నర్సాపూర్‌, బొమ్మల రామారం సబ్‌స్టేషన్ల లాగ్‌బుక్‌లను తాను పరిశీలించానని, వ్యవసాయానికి 10 నుంచి 11 గంటలకు మించి మూడు ఫేజ్‌ల విద్యుత్‌ సరఫరా కావడం లేదని ఆరోపించారు. యూరియా, డీఏపీ ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆన్‌లైన్‌ యాప్‌లో ఎరువులు బుక్‌ చేసుకునే సమయంలో కొన్ని గ్రామాల పేర్లు కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, కనెక్షన్ల ధరలను పెంచినా అవసరమైన మెటీరియల్‌ అందుబాటులో లేదని అధికారులు చెబుతున్నారని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీసుకోబోమని చెప్పి ఒక్కో బస్తాకు 3 నుంచి 5 కిలోల వరకు తరుగు తీసుకున్నారని ఆరోపించారు. రెండు యాసంగి సీజన్లకు సంబంధించిన బోనస్‌ కూడా రైతులకు అందలేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. గత రెండున్నరేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయని, సుమారు 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెల్లించిందని పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్‌ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

మహాలక్ష్మి హామీపై ప్రశ్నలు: మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 32 నెలలు గడిచినా ఆ హామీ అమలు కాలేదని హరీశ్‌రావు విమర్శించారు. ఈ లెక్కన ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.80 వేల వరకు బాకీ పడిందని అన్నారు. మహిళలకు సంబంధించిన బీమా ప్రయోజనాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.

అసెంబ్లీలో బహిరంగ చర్చకు సవాల్‌: మైనింగ్‌, 22ఏ భూములు, రుణమాఫీ, ఎరువులు, స్కాలర్‌షిప్‌లు తదితర అంశాలపై తాను ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని, ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ, రైతుబంధు, ఉద్యోగాలపై అసెంబ్లీ సాక్షిగా బహిరంగ చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధం కావాలని సవాల్‌ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను తగినన్ని రోజులు నిర్వహించాలని కోరారు. జిల్లాకు సీఎం వచ్చినప్పుడు తాగునీరు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైతులు, విద్యార్థుల సమస్యలపై మాట్లాడాలని, రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.