హరీష్ రావుపై వ్యాఖ్యలను ఖండించిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్
జనగణమన బ్యూరో – హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం 1300 మంది అమరుల త్యాగాలతో ఏర్పడిందని, అలాంటి పవిత్రమైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలతో అపవిత్రం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో “క్షుద్ర పూజలు” అనే అంశాన్ని రాజకీయ చర్చల్లోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ నాయకులు క్షుద్ర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. రాజకీయ పార్టీలు శాస్త్రీయ దృక్పథంతో మాట్లాడాలని, ప్రజల్లో మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన పేర్కొన్నారు. హిందూ ఆచారాలు, అఘోర సంప్రదాయాలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ నాయకులు హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను శివభక్తుడినని పేర్కొన్న ప్రవీణ్ కుమార్, దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. హరీష్ రావు ఏ దేవాలయానికైనా వెళ్లడం ఆయన వ్యక్తిగత విషయం అని, దానిపై రాజకీయ విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. హరీష్ రావు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పూజలు చేస్తున్నారో తెలుసుకునే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదన్నారు.
ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, మేడారం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులందరినీ “క్షుద్ర పూజలు” చేస్తున్నట్లుగా కాంగ్రెస్ భావిస్తున్నదా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. హరీష్ రావు పంపిన లీగల్ నోటీసులకు సంబంధిత కాంగ్రెస్ నేతలు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులపై కూడా ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే కొందరు నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. క్షుద్ర పూజలు చేస్తే ప్రకృతి చక్రం ఆగిపోదని వ్యాఖ్యానించిన ఆయన, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హిందూ ధర్మ రక్షకులమని చెప్పుకునే బీజేపీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అదేవిధంగా అయోధ్య రామమందిర నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, సీఎం రేవంత్ రెడ్డి అర్థరాత్రి నిర్వహించిన గృహప్రవేశం వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కె. కిషోర్ గౌడ్, గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.