జనగణమన బ్యూరో – హైదరాబాద్: రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు యువతకు యూత్ డిక్లరేషన్, యూత్ క్యాలెండర్, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సహా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టింది “జాబ్ క్యాలెండర్” కాదని, “జాబులే లేని క్యాలెండర్” అని విమర్శించారు. 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అయితే యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే యువకుడినే విద్యాశాఖ మంత్రిగా నియమిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకుని ఆ పదవిని యువకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించిన కేటీఆర్, గురుకుల విద్యార్థుల మరణాలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల భర్తీలో జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి ఇప్పటివరకు కేవలం 10 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆయన రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వంపై దాఖలైన ఒక “ఛార్జ్‌షీట్” లాంటిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు లోనుకాకూడదని, ఎవరూ ఆత్మహత్యలు లేదా బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.
ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన “క్రిమినల్ వేస్ట్” వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సత్తా చాటుతున్న తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అవమానించే అర్హత ముఖ్యమంత్రికి లేదని, తన ఎన్నికల అఫిడవిట్‌ను సైతం స్వయంగా నింపే సామర్థ్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి నిర్మాణాలన్నీ ఇంజనీర్ల కృషి ఫలితమేనని పేర్కొన్న కేటీఆర్, “భవనాలు నిర్మించడం మాత్రమే కాదు, తమను అవమానించిన నాయకులకు రాజకీయంగా సమాధి కట్టడం కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలుసు” అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కేటీఆర్, ఇతర రాష్ట్రాల్లో యువత సమస్యలపై స్పందించే కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, అరెస్టులు, కేసులు, ఆత్మహత్యాయత్నాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ అంశాలపై తాము ఇప్పటికే రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందుకు సిద్ధం కాకపోతే అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపడంతో పాటు 1.65 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఐటీ రంగం, పెట్టుబడులు, పరిశ్రమలపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారని, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపివేయడం కూడా ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించిన కేటీఆర్, ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న రివర్స్ పంపింగ్, మానేరు–ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటి తరలింపు కార్యక్రమాలు కూడా కాలేశ్వరం వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. సాగునీటి శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. గత ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ మెట్రో విస్తరణ పనులను ముందుకు తీసుకెళ్లగా వాటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. మెట్రో విస్తరణపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ, ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిందని ఆరోపించారు. సివిల్ సప్లైస్ శాఖ అవినీతి, విద్యాశాఖలో బంకర్ బెడ్స్ కుంభకోణంపై పోరాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంటూ, ఆయన అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.