రైతాంగ సమస్యలు పరిష్కరించాలి
- యూరియా యాప్ రద్దు చేయాలి.. 2025 విత్తన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వినతిపత్రం
జనగణమన ప్రతినిధి – సిద్దిపేట: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు మండల కేంద్రంలో రైతులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, వ్యవసాయ రంగానికి అనుకూలమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా వంటి అత్యవసర ఎరువుల సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే 2025 విత్తన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విత్తనాల విషయంలో రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలను రూపొందించాలని, రైతులపై అదనపు భారాన్ని మోపే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా, రైతులు ఎంత పంట ఉత్పత్తి చేసినా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోలులో పరిమితులు విధించకుండా రైతుల నుంచి మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరమైన గిడ్డంగులను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ‘సి2 + 50 శాతం’ సూత్రాన్ని అమలు చేసి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేశారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులను పరిగణనలోకి తీసుకుని రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, రైతుల నుంచి వచ్చిన డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టాలని ఎంపీడీవోను రైతులు కోరారు.
ఈ కార్యక్రమంలో రైతులు చల్లారపు తిరుపతిరెడ్డి, చంద్రపు రాజిరెడ్డి, సిహెచ్. సంజీవరెడ్డి, ఏ. కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.