జనగణమన ప్రతినిధి – హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, విద్యా వ్యవస్థపై చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియా తో మాట్లాడుతూ… విద్యార్థుల విద్యపై అయ్యే ఖర్చును “క్రిమినల్ వేస్ట్”గా అభివర్ణించారని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. తెలంగాణ యువత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలకు విద్యార్థులను బాధ్యులుగా చూపడం సరికాదని, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. విద్యా రంగానికి ఎన్నికల హామీ మేరకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలని, టాస్క్ (TASK) సంస్థను పునరుద్ధరించాలని, మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిలిపివేసి, గ్రామీణ మరియు పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్పందించి తన వ్యాఖ్యలను స్పష్టం చేయాలని దాసోజు కోరారు.