బ్రిక్స్ దేశాల మంత్రులకు ఫలక్ నమా ప్యాలెస్‌లో సీఎం అధికారిక విందు
- విదేశీ ప్రతినిధులకు తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై వివరణ
హైదరాబాద్, జూలై 15: హైదరాబాద్‌లో జరుగుతున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు (BRICS Labour and Employment Ministers’ Meeting) మరియు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026 సందర్భంగా ఫలక్నుమా ప్యాలెస్‌లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బ్రెజిల్ దేశాల మంత్రులను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమివ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించారు.
విందు కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో పాటు రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. విదేశీ ప్రతినిధులతో వారు స్నేహపూర్వకంగా ముచ్చటించి, పరస్పర సహకారం, కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుపై అభిప్రాయాలు పంచుకున్నారు. బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026కు అనుబంధంగా నిర్వహించిన ఈ అధికారిక విందు ద్వారా సభ్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర అవగాహన పెంపొందించే అవకాశం లభించింది. భారతదేశం అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తోందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, కార్మిక శాఖ కార్యదర్శి హరి చందనతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ ఆతిథ్యం, ఫలక్నుమా ప్యాలెస్ వైభవాన్ని ప్రశంసించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.