జనగణమన దినపత్రిక

వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం

- మెటాకు నోటీసులు

2

న్యూఢిల్లీ, జూలై 1: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ప్రవేశపెట్టనున్న ‘యూజర్ నేమ్’ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ అమలుకు సంబంధించి వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. యూజర్ నేమ్ ఫీచర్‌ను ఎందుకు ప్రవేశపెడుతున్నారో, దీనివల్ల వినియోగదారుల భద్రతపై ఎలాంటి ప్రభావం ఉంటుందో మూడు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు యూజర్ నేమ్ ఫీచర్‌ను అమల్లోకి తీసుకురావద్దని మెటాకు స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

కేంద్రం అభిప్రాయం ప్రకారం, యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ దాడులు, డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్ స్కామ్‌లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొబైల్ నంబర్‌కు బదులుగా యూజర్ నేమ్‌లను ఉపయోగించే అవకాశం కల్పిస్తే, సైబర్ నేరగాళ్లు తమ అసలు గుర్తింపును దాచుకుని అమాయకులకు సందేశాలు పంపడం, నకిలీ అధికారులుగా లేదా సంస్థల ప్రతినిధులుగా నటించి మోసాలకు పాల్పడడం సులభమవుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్టు, పెట్టుబడి మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు వంటి సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త ఫీచర్ల అమలులో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం యూజర్ నేమ్ ఫీచర్‌పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం వాట్సాప్‌లో కొత్త ఫీచర్ల అమలుపై కేంద్రం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోందనే సంకేతంగా భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.