మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలి
- ఢిల్లీలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణమన బ్యూరో – హైదరాబాద్: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్లో ఆయన విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడ్డాయని గుర్తు చేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఏ పదవి చేపట్టినా వాటికి వన్నె తెచ్చారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేయడంలో సోనియా గాంధీతో పాటు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై మన్మోహన్ సింగ్ చేసిన సంతకాన్ని చారిత్రక గుర్తుగా ఇక్కడ భద్రపరిచామని తెలిపారు. విద్యా హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ–పునరావాస చట్టం వంటి పలు కీలక చట్టాలు ఆయన హయాంలో అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు.
మన్మోహన్ సింగ్ దేశం గర్వించదగ్గ జాతిరత్నమని, ఆయన ఆలోచనలు, సంస్కరణలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్లమెంటులో ప్రస్తావించాలని రాజ్యసభ సభ్యులను కోరుతామని చెప్పారు.
కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, మాజీ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.