జనగణమన దినపత్రిక

గణేశ్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

- ట్రాఫిక్‌, బందోబస్తు చర్యలు.. నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

3

జనగణమన బ్యూరో – హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గత సంప్రదాయాన్ని పునరుద్ధరించిన తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గణేశ్‌ మండపాల నిర్వాహకులు ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎవరెవరు హాజరవుతున్నారనే వివరాలను స్థానిక కమిషనరేట్‌కు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు.

మండపాలకు ఉచిత విద్యుత్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మండపాల నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని పొందాలని సూచించారు. ఎక్కడెక్కడ గణేశ్‌ మండపాలను ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే పోలీసు శాఖకు సమాచారం అందిస్తే ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు నిర్వహణ మరింత సులభతరం అవుతుందని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీసు, మున్సిపల్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మల కోసం ఏర్పాట్లు చేస్తున్న తరహాలోనే గణేశ్‌ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గణేశ్‌ ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్‌, పోలీసు శాఖలు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ ప్రశాంతతే పెట్టుబడులకు కీలకం

హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో నిర్వాహకుల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. గణేశ్‌ ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికారులు, ఉత్సవ కమిటీలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.