జనగణమన దినపత్రిక

బ్రిక్స్‌ దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం

- మారథాన్‌ చర్చల అనంతరం ఉమ్మడి ప్రకటనకు గ్రీన్‌సిగ్నల్‌.. నేడు నేతల ఆమోదం

1

జనగణమన బ్యూరో – న్యూఢిల్లీ: భారత్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘంగా, అర్ధరాత్రి దాటే వరకు సాగిన చర్చల అనంతరం బ్రిక్స్‌ సభ్యదేశాలు ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

ప్రత్యేకించి పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ఇరాన్‌–యూఏఈ మధ్య భిన్నాభిప్రాయాలు ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడంలో ప్రధాన సవాలుగా మారాయి. అయినప్పటికీ సభ్యదేశాల మధ్య విస్తృత సంప్రదింపులు, దౌత్యపరమైన చర్చల ద్వారా విభేదాలను అధిగమించి సంయుక్త ప్రకటనకు మార్గం సుగమమైంది.  ఉమ్మడి ప్రకటనలో ఏ దేశం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏకపక్ష యుద్ధ చర్యలను ఖండించే అంశం ఉండనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిక్స్‌ దేశాలు సమష్టిగా శాంతి, బహుపాక్షిక సహకారం, అంతర్జాతీయ స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయనున్నాయి.

భారత్‌కు దౌత్యపరమైన విజయం

బ్రిక్స్‌ అధ్యక్ష దేశంగా భారత్‌ భిన్నాభిప్రాయాలున్న సభ్యదేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఇరాన్‌, యూఏఈ వంటి దేశాల మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం భారత్‌ దౌత్య నైపుణ్యానికి నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రిక్స్‌లో 11 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను ఈ కూటమి ప్రతినిధ్యం వహిస్తోంది. ఆర్థిక సహకారంతో పాటు ప్రపంచ పాలన, వాణిజ్యం, పెట్టుబడులు, శాంతి-భద్రత వంటి అంశాల్లో బ్రిక్స్‌ ప్రభావం పెరుగుతోంది.

న్యూఢిల్లీలో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్‌ నేతలు ఈ ఉమ్మడి ప్రకటనకు తుది ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.