జనగణమన దినపత్రిక

జర్నలిస్టుల సమస్యలపై టీడబ్ల్యూజేఎఫ్ పోరుబాట

- రేపు జిల్లాల కలెక్టరేట్ల వద్ద బహిరంగ నిరసనలు.. 15న సమాచార్ భవన్ ముట్టడి

3

హైదరాబాద్, జూలై 12: వర్కింగ్ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బహిరంగ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఫెడరేషన్ పిలుపునిచ్చింది. అలాగే ఈ నెల 15న హైదరాబాద్‌లోని సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయం అయిన సమాచార్ భవన్ ఎదుట భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ అధ్యక్షుడు పి. రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య శనివారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ తీవ్ర జాప్యం జరుగుతోందని, ఒకే సంఘానికి చెందిన వారిని అక్రిడిటేషన్ కమిటీల్లో నియమించడం వల్ల పారదర్శకత దెబ్బతింటోందని ఆరోపించారు. అధికారులు నామమాత్రపు పాత్రకే పరిమితమవుతున్నారని, ఏకపక్షంగా కార్డులు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు.

గత నాలుగు దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ జరగలేదని, వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో జర్నలిస్టులకు పూర్తిస్థాయి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రైల్వే జర్నలిస్టు పాసుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం ఫెడరేషన్ శ్రేణులకు పిలుపునిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.