సకల వసతులతో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి
- రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
న్యూఢిల్లీ, జూన్ 22: భారత వాయుసేన (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. సోమవారం ఢిల్లీలోని కర్తవ్య భవన్లో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ రంగ ప్రాజెక్టులపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రం పూర్తి సహకారం: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ, యుటిలిటీల బదిలీ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు. దేశ రక్షణ, జాతీయ భద్రతకు కీలకమైన ఈ విమానాశ్రయం భారత వాయుసేన అవసరాలతో పాటు పౌర విమానయాన రంగ అభివృద్ధికి కూడా ఉపయోగపడేలా రూపొందించాలని సీఎం సూచించారు. వాయుసేన టెర్మినల్‌తో పాటు పౌర విమానయాన శాఖకు చెందిన ప్రత్యేక టెర్మినల్‌ను కూడా నిర్మించాలని కోరారు.
కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సదుపాయాల ఏర్పాటుపై దృష్టి: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు, విమానాల మరమ్మతు మరియు నిర్వహణ కేంద్రాలు (MRO), హ్యాంగర్ సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సదుపాయాలు ఏర్పడితే తెలంగాణలో విమానయాన రంగానికి కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థలు తమ హ్యాంగర్లు, నిర్వహణ కేంద్రాల కోసం అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నాయని సీఎం వివరించారు. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ అనుకూలత, విస్తరణ అవకాశాల దృష్ట్యా ఆదిలాబాద్ హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూల ప్రాంతమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దేవరకద్రలో డీఆర్డీవో ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వాలి: సమావేశంలో మరో కీలక అంశంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రతిపాదిత డీఆర్డీవో/డీఆర్డీఎల్ ప్రాజెక్టు అంశాన్ని సీఎం ప్రస్తావించారు. రక్షణ పరిశోధన రంగానికి చెందిన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే దేవరకద్ర ప్రాంతాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో, త్వరితగతిన ఆమోదం మంజూరు చేయాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే తెలంగాణలో రక్షణ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కొత్త దిశ లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి కే.ఎస్. శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి (కోఆర్డినేషన్) అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.