నారాయణపేట: అవినీతిపై యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. ఆర్డీఓగా పనిచేస్తున్న రామచందర్ నాయక్ మంగళవారం రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.
ఫిర్యాదుదారుడి నుంచి నిర్దిష్ట పనిని పూర్తిచేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు. మంగళవారం లంచం తీసుకుంటున్న సమయంలోనే ఆర్డీఓను అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో ఉన్న ఆర్డీఓ నివాసంలో, అలాగే కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో అక్రమ ఆస్తులు, నగదు, ముఖ్యమైన పత్రాలు లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది. ఉన్నతస్థాయి అధికారిగా ఉన్న ఆర్డీఓ లంచం కేసులో పట్టుబడటం ప్రభుత్వ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
…