ఫీజులు, ఆడిట్ లెక్కలు వెల్లడించని స్కూళ్లపై ప్రభుత్వం సీరియస్
- 13,500 ప్రైవేట్ బడులకు షోకాజ్ నోటీసులు
జనగణమన బ్యూరో – హైదరాబాద్: ఫీజుల వివరాలు, వార్షిక ఆడిట్ లెక్కలను ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13,500 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓ)లకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
రాష్ట్రంలో మొత్తం 13,677 గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల వారీ ఫీజుల వివరాలను ఇప్పటివరకు కేవలం 739 పాఠశాలలు మాత్రమే ప్రభుత్వ వెబ్పోర్టల్లో నమోదు చేశాయి. అంటే దాదాపు 5 శాతం పాఠశాలలే వివరాలను సమర్పించగా, 12,938 పాఠశాలలు ఇంకా ఫీజుల వివరాలను వెల్లడించలేదు.
నోటీస్ బోర్డులోనూ.. వెబ్సైట్లోనూ తప్పనిసరి
ప్రతి తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో పాఠశాల నోటీస్ బోర్డుపై, అలాగే పాఠశాల అధికారిక వెబ్సైట్లో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంది. అంతేకాకుండా సంబంధిత వివరాలను విద్యాశాఖ పోర్టల్లోనూ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫీజుల పారదర్శకత, తల్లిదండ్రులకు సమాచారం అందుబాటులో ఉండేలా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఆడిట్ లెక్కల్లోనూ భారీగా పెండింగ్
ఫీజుల వివరాలతో పాటు పాఠశాలల వార్షిక ఆదాయ-వ్యయాల ఆడిట్ నివేదికలను సమర్పించడంలోనూ పెద్ద సంఖ్యలో పాఠశాలలు విఫలమయ్యాయి. తెలంగాణ విద్యా చట్ట నిబంధనల ప్రకారం ప్రతి విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వార్షిక పరిపాలనా నివేదికతో పాటు ఆడిట్ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
గత మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి కేవలం 166 పాఠశాలలు మాత్రమే ఆడిట్ లెక్కలను సమర్పించాయి. 2023–24లో 147 పాఠశాలలు, 2024–25లో 162 పాఠశాలలు మాత్రమే వివరాలు ఇచ్చాయి. మిగిలిన పాఠశాలలు ఇంకా వివరాలు సమర్పించాల్సి ఉంది.
జూలై 30 గడువు దాటినా స్పందన కరవు
ఫీజుల వివరాలు, ఆడిట్ నివేదికలను సమర్పించేందుకు జూలై 30ను గడువుగా నిర్ణయించినప్పటికీ అనేక పాఠశాలల యాజమాన్యాలు స్పందించలేదు. అనంతరం ఆగస్టులో విద్యాశాఖ పలుమార్లు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తగిన స్పందన రాకపోవడంతో తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ తక్కువ సమర్పణ
ఫీజుల వివరాల సమర్పణలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో పాఠశాలలు వివరాలు ఇవ్వలేదు. హైదరాబాద్లో 2,275 పాఠశాలలకు గాను 111 మాత్రమే ఫీజుల వివరాలు నమోదు చేశాయి. మేడ్చల్-మల్కాజిగిరిలో 1,968 పాఠశాలల్లో 26, రంగారెడ్డిలో 2,046 పాఠశాలల్లో కేవలం 12 పాఠశాలలు వివరాలు సమర్పించాయి. సంగారెడ్డిలో 635 పాఠశాలలకు గాను కేవలం రెండు పాఠశాలలు ఫీజుల వివరాలు ఇచ్చాయి.
నిబంధనలు పాటించని పాఠశాలలకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసి, వాటి సమాధానాలను విద్యాశాఖ డైరెక్టరేట్కు పంపాలని డీఈఓలను అధికారులు ఆదేశించారు. నోటీసులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోయినా, నిబంధనలను కొనసాగిస్తూ ఉల్లంఘించినా గుర్తింపు రద్దు సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.