జనగణమన దినపత్రిక

సిరిసిల్లను అభివృద్ధి చేసే బాధ్యత నాదే: సీఎం రేవంత్‌రెడ్డి

- బీఆర్‌ఎస్‌ పాలనలో సిరిసిల్లకు అన్యాయం.. కాంగ్రెస్‌తో అభివృద్ధి చేస్తాం: సీఎం

2

జనగణమన ప్రతినిధి – రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, అయితే గత బీఆర్‌ఎస్‌ పాలనలో తీసుకున్న నిర్ణయాలతో సిరిసిల్లను ‘ఊరిసిల్ల’గా మార్చారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత పాలనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైందని, అలాంటి వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల కేంద్రంగా ఉందని సీఎం అన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల నైపుణ్యానికి సిరిసిల్ల ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలను తయారు చేసే ప్రత్యేకత ఇక్కడి నేత కార్మికులకు ఉందన్నారు. గతంలో సిరిసిల్ల అభివృద్ధి కోసం పాపారావు, కేకే మహేందర్‌రెడ్డి వంటి వారు పనిచేశారని, అనంతరం కేసీఆర్‌, కేటీఆర్‌ కుటుంబం రాజకీయంగా ఎదిగి సిరిసిల్లను తమ రాజకీయ అడ్డాగా మార్చుకుందని సీఎం ఆరోపించారు. కేటీఆర్‌ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినా చేనేత కార్మికుల సమస్యలు, ఆత్మహత్యలు, గల్ఫ్‌ వలసలు ఎందుకు కొనసాగాయని ప్రశ్నించారు.

కేటీఆర్‌, కేసీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌రావు తదితరుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రాకముందు ఉన్న ఆస్తులకు, ఆ తర్వాత పెరిగిన ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి తనతో చర్చించాలని సవాల్‌ విసిరారు. గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన సిరిసిల్ల కార్మికుల సమస్యలను ప్రస్తావించిన సీఎం.. గత ప్రభుత్వాలు ఇన్నేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ వలసలను ఎందుకు అరికట్టలేకపోయాయని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస కార్మికుల కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చామని, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

మిడ్‌మానేరు ప్రాజెక్టు, నేరెళ్ల ఘటన, మానేరు ఇసుక తదితర అంశాలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు చేశారు. నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగిన దాడులకు బాధ్యులెవరో ప్రజలు ఆలోచించాలని అన్నారు. చేనేత, గీత కార్మికులు, రైతులకు అండగా ఉంటామని చెప్పిన గత పాలకులు చివరకు వారిని ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు.

చేనేతకు రూ.1,730 కోట్ల ఖర్చు

తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేనేత కార్మికుల కోసం రూ.1,730 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ చీరల బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు.

వేములవాడ అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించామని, యంగ్‌ ఇండియా స్కూల్‌, ఎంఆర్‌ఓ కార్యాలయాలు, మహిళా పోలీస్‌స్టేషన్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి ఇంటికి ఉద్యోగం వంటి హామీలు అమలు కాలేదని సీఎం విమర్శించారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా ఫామ్‌హౌస్‌లు, ప్రగతిభవన్‌లు మాత్రం సకాలంలో నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు.

75 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పుల్లో ఉన్న, విధ్వంసానికి గురైన తెలంగాణను అభివృద్ధి, వికాసం వైపు తీసుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఆర్టీసీకి రెండున్నరేళ్లలో రూ.12 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. పేదలు, మహిళలు, బీసీలు, దళితులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు, నేరెళ్ల శారదకు కీలక పదవులు కల్పించామని చెప్పారు. బీసీ బిడ్డ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ నియమించిందని, సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సిరిసిల్లలో కాంగ్రెస్‌ గెలిస్తే మంత్రి పదవి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి బిడ్డను పెద్దల సభకు పంపించాలని, సిరిసిల్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి ఇచ్చేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కోరుతున్నట్లు సీఎం తెలిపారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని చెప్పారు. గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ను ఓడించినట్లే సిరిసిల్లలోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

“సిరిసిల్ల ప్రజలు మళ్లీ గడీల వైపు, రాతియుగం వైపు వెళ్లాలా? లేక ప్రజల తెలంగాణ వైపు ముందుకు సాగాలా?” అని సీఎం ప్రశ్నించారు. రానున్న కాలంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన కొనసాగుతుందని పేర్కొంటూ.. సిరిసిల్ల అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. “బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ మీకు గతం.. ఇకపై అంతా కాంగ్రెస్‌, అంతా మూడు రంగుల జెండానే” అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.