ఉత్తరాఖండ్: హిమాలయాల ఒడిలో జరిగే ఆధ్యాత్మిక మహోత్సవం చార్‌ధామ్ యాత్ర ఈ ఏడాది వైభవంగా ప్రారంభమైంది. తొలి దశగా యమునోత్రి ఆలయం, గంగోత్రి ఆలయం ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. వేలాదిమంది భక్తులు పర్వత ప్రాంతాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం ఈ నెల 22న ఉదయం ఘనంగా తెరుచుకోనుంది. తదుపరి రోజు, అంటే 23న ఉదయం 6:15 గంటలకు బద్రీనాథ్ ఆలయం ద్వారాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో చార్‌ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది.
భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఈసారి యాత్రకు వచ్చే వారందరూ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ముందస్తు నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే యాత్రకు అనుమతి ఇవ్వనున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వసతి వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదేవిధంగా, ఈనెల 22 నుంచి హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులకు ఇవి ఎంతో ఉపశమనంగా మారనున్నాయి. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలకు త్వరగా చేరుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది. వర్షాకాలం ముగిసే వరకూ భక్తుల రాకపోకలు కొనసాగుతాయని అంచనా. భారీగా భక్తులు తరలివస్తుండటంతో స్థానిక వ్యాపారాలకు, పర్యాటక రంగానికి ఊతం లభించనుంది. భక్తులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, అధికారుల సూచనలు పాటిస్తూ యాత్రలో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.