దళితులు, గిరిజనులకు భరోసా
- ప్రభుత్వ పథకాలు, అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం పై సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
జనగణమన బ్యూరో – హైదరాబాద్: దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అన్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, బాధితులకు అందుతున్న పరిహారం, పునరావాస చర్యలను సీఎం సమీక్షించారు. ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్ కోర్టుల పనితీరుపైనా చర్చించారు.
అట్రాసిటీ కేసుల బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు సకాలంలో న్యాయం, ఆర్థిక సహాయం, పునరావాసం అందేలా మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా 73 గ్రామాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు అధికారులు వివరించారు. ఆయా ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎస్సీలకు 31 శాతం, ఎస్టీలకు 17 శాతం లబ్ధి కల్పించినట్లు వివరించారు. 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అల్పాహారం అందిస్తున్నామని, రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
చదువుతోనే మార్పు: విద్య ఒక్కటే జీవితాలను మార్చగలదని, సమాజంలోని అసమానతలు, అణిచివేతకు విద్యతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పిల్లలను చదువుతో పాటు క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం దళితులు, గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తోందని స్పష్టం చేశారు.