జనగణమన దినపత్రిక

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుంది

- ఆర్యవైశ్యులు రాజకీయాల్లో తమ వాటా కోసం ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

3

జనగణమన బ్యూరో – హైదరాబాద్: ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా కలిగినవారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కష్టాలు, బాధలు ఎదురైనా సమాజంలో గౌరవంతో జీవించేందుకు ప్రాధాన్యత ఇచ్చే వర్గం ఆర్యవైశ్య సమాజమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, అభ్యున్నతికి తన ప్రభుత్వం సంపూర్ణంగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల్లో అనేక మంది పేదరికంలో ఉన్నప్పటికీ, ఆత్మగౌరవం కారణంగా తమను పేదలుగా గుర్తింపు పొందేందుకు కూడా ఇష్టపడరని సీఎం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక పేద కుటుంబానికి కష్టకాలంలో కనీసం తినడానికి అప్పుగా సహాయం చేసేవారు ఆర్యవైశ్య సోదరులేనని పేర్కొన్నారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్య సోదరులేనని చెప్పారు.

వ్యవసాయం, వ్యాపారమే ప్రధాన వృత్తులు

ప్రపంచంలో ప్రధానంగా రెండు వృత్తులే ఉన్నాయని, అవి వ్యవసాయం, వ్యాపారం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యాపార రంగంలో ఆర్యవైశ్యులు తమదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. గతంలో చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ముఖ్యమంత్రులు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించేవారని గుర్తుచేశారు.

రోశయ్యను ముందుగా గుర్తించింది కాంగ్రెస్

మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్యను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడటానికి అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య నిర్వహించిన ఆర్థిక వ్యవహారాలు కూడా కారణమని అన్నారు. రోశయ్యకు అవకాశం, గౌరవం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం పేర్కొన్నారు. శాసనమండలిలో తాను దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో రోశయ్య తనను పిలిచి ఆవేశాన్ని తగ్గించుకుని అనుభవంతో ముందుకు వెళ్తే రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగగలవని ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. తనను రాజకీయంగా ముందుగా గుర్తించిన నాయకుడు రోశయ్య అని అన్నారు. రోశయ్య ఎవరినీ విమర్శించేవారు, తిట్టేవారు కాదని, తనదైన శైలిలో చురకలు వేస్తూ సూచనలు చేసేవారని సీఎం చెప్పారు.

హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం

రాష్ట్ర విభజన జరిగినప్పటికీ రోశయ్య గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. విగ్రహం ఏర్పాటుపై కొంతమంది విమర్శలు చేసినా, హైదరాబాద్‌తో రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నాలుగు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌కు వచ్చిన రోశయ్య.. మంచైనా, చెడైనా హైదరాబాద్ తనదేనని చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఆయన మాటలను గౌరవించి నగరంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రపంచస్థాయి నాయకుడు మహాత్మా గాంధీ

ఆర్యవైశ్యులను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నప్పటికీ, ఆ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు దేశానికి విశేష సేవలు అందించారని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ భారతదేశానికి చెందిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వారు ఉండరని అన్నారు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ మహాత్మా గాంధీ అని సీఎం పేర్కొన్నారు. ప్రపంచస్థాయి నేతగా మహాత్మా గాంధీ ఎదగడంతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండటం గర్వకారణమని అన్నారు. అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం

పొట్టి శ్రీరాములు పోరాటం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రత కోసం మహాత్మా గాంధీ ప్రాణత్యాగం చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సమాజానికి రావాల్సిన స్థాయిలో గుర్తింపు ఇంకా రాలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.

ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వ సహకారం

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పిల్లలకు ఆత్మగౌరవ భవనం పూర్తిస్థాయిలో ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. “నేను మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తా” అని సీఎం స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సమాజం సహకరించాలని కోరారు.

రాజకీయాల్లో మీ వాటా మీరు తీసుకోవాలి

ఆర్యవైశ్యులు కలిసి ఉంటేనే బలం చేకూరుతుందని సీఎం అన్నారు. సమైక్యంగా, ఒక్కతాటిపై నడిస్తే సమాజంలో అందరూ గౌరవిస్తారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చామని, కొడంగల్‌లోని ఒక మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవి కల్పించామని తెలిపారు.

రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటాను తాము తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజం ఐక్యంగా ఉంటేనే రాజకీయాల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. ఆర్యవైశ్యులకు ముందు చూపు, జాగ్రత్త స్వభావం వారి డీఎన్‌ఏలోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమాజం ఐక్యతతో ముందుకు సాగుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.