జనగణమన ప్రతినిధి – సూర్యాపేట: నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని నకిరేకల్ బహిరంగ సభతో మరోసారి నిరూపితమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు భారీగా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు తరలివచ్చారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతులు, మహిళలు, యువత, పేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని సీఎం పేర్కొన్నారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని చెప్పారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, వివిధ వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. తమ ప్రభుత్వం రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలు కల్పించిందన్నారు. రేషన్ కార్డుల ద్వారా 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు.
బీఆర్‌ఎస్ నాయకుల విమర్శలపై తీవ్రంగా స్పందించిన సీఎం.. “చేతనైతే తండ్రి, కొడుకు, అల్లుడు అసెంబ్లీకి రండి.. లెక్కలు తేల్చుకుందాం” అని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
“ఈ నెలాఖరులో సిరిసిల్లకు వస్తా.. కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం. ప్రస్తుత సీట్లే ఉంటే 90 సీట్లతో, సీట్లు పెరిగితే 117 సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. 2024 నుంచి 2034 వరకు రెండు సార్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది” అని రేవంత్‌రెడ్డి అన్నారు.
చివరగా కేసీఆర్‌ను ఉద్దేశించి “అసెంబ్లీకి రా.. లేకుంటే గౌరవంగా రాజీనామా చేయి.. గజ్వేల్‌లో తేల్చుకుందాం” అని సవాల్ విసిరారు.