వైఎస్ ఆశయాలను వంద శాతం కొనసాగిస్తాం
- ప్రాణహిత–చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణకు అంకితం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
జనగణమన బ్యూరో – న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేదలు, రైతులు, ప్రజల సంక్షేమం కోసం వైఎస్ చేపట్టిన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టితో చేపట్టిన చర్యల ఫలితంగా దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందని అన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించే చర్యలను తొలిసారిగా చేపట్టిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను అందించడం వంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర కీలకమని తెలిపారు. తెలంగాణలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, ఇందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంక్షేమ వ్యవస్థే పునాది అని అన్నారు.
రైతుల గుండెల్లో వైఎస్‌కు ప్రత్యేక స్థానం
రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సీఎం గుర్తుచేశారు. విద్యుత్ బకాయిలుగా ఉన్న రూ.1,300 కోట్లను రద్దు చేయడంతో పాటు రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారి గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారని అన్నారు. తెలంగాణలో సాగునీటి విస్తరణకు ప్రాణహిత–చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బీసీ టన్నెల్ వంటి ప్రాజెక్టులకు వైఎస్ హయాంలో శ్రీకారం చుట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాణహిత–చేవెళ్ల, ఎస్ఎల్బీసీ పనులు నిలిచిపోయాయని పేర్కొంటూ, వాటిని పూర్తి చేయడంతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తిచేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ చివరి కోరికను నెరవేర్చాలి
వైఎస్ అభిమానులకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే వైఎస్ మరణించారని అన్నారు. దేశ ప్రజలు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే నాయకత్వం అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించగల వ్యక్తి రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన నివాళి అని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు.