జనగణమన దినపత్రిక

గ్లోబల్‌ సమ్మిట్‌–రక్షణ ఎక్స్‌పోలో భాగస్వాములు కండి

- డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరిగే రక్షణ ఎక్స్‌పో ప్రారంభానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

1

జనగణమన బ్యూరో – న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు హాజరుకావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. బుధవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌ సింగ్‌తో రేవంత్‌రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ ఎక్స్‌పో

రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలపై ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరై మార్గనిర్దేశం చేస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న రక్షణ ఎక్స్‌పో–2026ను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతం చేసేందుకు రక్షణ శాఖ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళ విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు పాల్గొనేలా సహకరించాలని కోరారు. స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

త్రివిధ దళాల భాగస్వామ్యం

భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు రక్షణ ఎక్స్‌పోలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ వంటి రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి మరో 750 ఎకరాలు

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ మొత్తం 1,500 ఎకరాలు కోరిన నేపథ్యంలో మరో 750 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.

దేవరకద్రలో డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టుకు భూమి

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ ఇప్పటికే అంగీకరించిందని సీఎం తెలిపారు. మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు వివరించారు. అవసరమైతే మరో రెండు పర్యాయాలు లీజును పొడిగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి జి. వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు ఎం. అనిల్‌కుమార్‌ యాదవ్‌, డాక్టర్‌ మల్లు రవి, సురేశ్‌ షెట్కార్‌, పోరిక బలరాం నాయక్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కార వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.