మూసీ రివర్‌ఫ్రంట్ తొలి దశపై సీఎం రేవంత్ సమీక్ష
- నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, భూసేకరణకు టీడీఆర్ లేదా పరిహారం
హైదరాబాద్, జూన్ 26: మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, ప్రజా భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎండీ నర్సింహారెడ్డి, ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్‌తో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మూసీ రివర్‌ఫ్రంట్ తొలి దశ ప్రాజెక్టు అమలు ప్రణాళికపై ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించారు. మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి, పునరావాసాన్ని మానవీయ దృక్పథంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణలో భూ యజమానుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. భూసేకరణకు సహకరించే వారికి వారి ఎంపిక మేరకు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) ఇవ్వడం లేదా తగిన ఆర్థిక పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను వినియోగించే క్రమంలో అక్కడ ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తరలించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డులో ప్రత్యేకంగా “మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కేంద్రంలో ప్రాజెక్టు రూపురేఖలు, చేపట్టబోయే అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలు డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అదేవిధంగా, ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.
మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తూ పర్యావరణ పరిరక్షణ, నగర సుందరీకరణ, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని సమావేశంలో అధికారులు వివరించారు.