పాలనంటే నలుగురి కోసం కాదు.. 4 కోట్ల ప్రజల కోసం
- కేసీఆర్ చేసిన అప్పులకు ఏటా రూ.76 వేల కోట్లు చెల్లిస్తున్నాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
వైరా, జూన్ 24: తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాలన అంటే ఒక కుటుంబానికి చెందిన నలుగురి కోసం చేసే వ్యవహారం కాదని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమం, భవిష్యత్తు కోసం జరిగే బాధ్యతాయుతమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఓటర్ల జాబితాపై పూర్తి అప్రమత్తత అవసరం
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా నమోదు, సవరణలు, మ్యాపింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎన్నికల ప్రక్రియపై పెరుగుతోందని పేర్కొన్న ఆయన, ఓటర్ల వివరాలను సేకరించి, విశ్లేషించే ప్రత్యేక వ్యవస్థలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని చెప్పారు. గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల సమాచారాన్ని సేకరించి, కొంతమంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారు.
బీహార్, బెంగాల్ ఉదాహరణలు ప్రస్తావించిన భట్టి
బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇదే తరహా ప్రక్రియల ద్వారా ఓటర్ల వివరాల క్రోడీకరణ జరిగిందని, కొన్ని నియోజకవర్గాల్లో 30 వేల నుంచి 40 వేల వరకు ఓట్లు తొలగించబడటంతో ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని భట్టి ఆరోపించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. మ్యాపింగ్ జాబితాతో పాటు అన్‌మ్యాపింగ్‌లో ఉన్న ఓటర్ల వివరాలను కూడా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని, ఓటర్ల ధృవపత్రాలు, వివరాలను పూర్తిగా పరిశీలించాలని కోరారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం చేసిన భారీ అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పులకు ప్రస్తుతం అసలు, వడ్డీ కలిపి సంవత్సరానికి రూ.76 వేల కోట్ల వరకు చెల్లిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ రైతులు, మహిళలు, పేదల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తూ సేవలందిస్తోందని, కానీ లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కేవలం రెండేళ్లలోనే దెబ్బతిన్నదని భట్టి విమర్శించారు. ప్రాజెక్టు పరిస్థితి చూస్తే అవినీతి స్థాయి ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినప్పటికీ ప్రజలకు, రైతులకు ఆశించిన స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేకపోయిందని ఆరోపించారు.
50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్
ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం 50 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా సంఘాలకు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ రహిత రుణాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో “యంగ్ ఇండియా స్కూల్స్” నిర్మిస్తున్నామని తెలిపారు.
అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు
కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం గాలి వార్తలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని భట్టి విమర్శించారు. ఒక టీవీ ఛానల్, కొన్ని పత్రికలను అడ్డం పెట్టుకుని నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.
ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.