జనగణమన దినపత్రిక

ప్రపంచస్థాయి నగరం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

- హైదరాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు

1

మియాపూర్, జూన్ 8: హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మియాపూర్‌లో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ వంటి ఆరు ప్రధాన నగరాలు నడిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే ఇతర మహానగరాలు కాలుష్యం, ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. ఢిల్లీలో కాలుష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ముంబైలో భారీ వర్షాలు వస్తే కార్ల కంటే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. బెంగుళూరు, చెన్నై, కలకత్తా నగరాలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

మూడు కార్పొరేషన్లతో హైదరాబాద్ అభివృద్ధి: హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసం మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామని సీఎం తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, పోలీసు మరియు మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా సరిహద్దులను కూడా నిర్ణయించామని వివరించారు. జెండాలు, ఎజెండాలకు అతీతంగా నగర అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

విద్య, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి: పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో 150 స్టాల్స్‌ను మహిళలకు కేటాయించామని చెప్పారు. మహిళలను పెట్రోల్ బంకుల యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను కూడా చేపట్టామని వివరించారు.

కేంద్ర నిధులపై బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన సీఎం: చేవెళ్ల, మెదక్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే కాదా అని ఆరోపించారు. గుజరాత్‌లోని సబర్మతి నది ప్రాంత అభివృద్ధిని ప్రశంసించే బీజేపీ నాయకులు, తెలంగాణలో మూసీ నది అభివృద్ధిని మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత బీజేపీ ఎంపీలకు లేదా అని ప్రశ్నించారు.

కేసీఆర్, మోదీ పాలనలపై చర్చకు సిద్ధం: పదేళ్ల చంద్ర శేఖర్ రావు పాలన, పన్నెండేళ్ల మోదీ పాలన, 30 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సీఎం ప్రకటించారు. ఎవరు ఏం చేశారో, ఎవరు ఎంత నిధులు తెచ్చారో ప్రజల ముందు చర్చిద్దామని సవాల్ విసిరారు.

అంతర్జాతీయ బస్ టెర్మినల్, మెట్రో విస్తరణ: హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు. మూడు నెలల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విశ్వనగరం అని చెప్పుకోవడం మాత్రమే కాకుండా అందుకు తగిన మౌలిక వసతులు కూడా ఉండాలని పేర్కొంటూ, మెట్రో రైలు రెండో దశ విస్తరణను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.

లక్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్ల నిర్మాణం: మహానగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం లక్ష ఎల్ఐజీ (LIG), ఎంఐజీ (MIG) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని సీఎం తెలిపారు. గతంలో రాజీవ్ గృహకల్ప పథకం తరహాలో ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే సమీపంలో ఇళ్లు నిర్మించి అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసి అక్కడ పేదలకు గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధే లక్ష్యం: తాను ప్రధానిని కలిస్తే వెంటనే కిషన్ రెడ్డి కూడా ప్రధానిని కలుస్తారని, తాను కేంద్ర మంత్రులను కలిస్తే ఆయన కూడా అదే చేస్తారని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి, నిధుల సాధనకు సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాబోయే 24 నెలలు పూర్తిగా అభివృద్ధిపైనే ప్రభుత్వ దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.