అమరావతి, జూన్ 4: అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న వీఐటీ-ఏపీ తొలి అమరావతి ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నాలుగో రోజు పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) చైర్మన్ అనిమిని రవి నాయుడు గురువారం టోర్నమెంట్ ప్రాంగణాన్ని సందర్శించారు. టోర్నమెంట్ నిర్వహణ, ఆటగాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన రవి నాయుడు, వీఐటీ-ఏపీ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో చెస్ క్రీడ అభివృద్ధికి ఇటువంటి ప్రతిష్ఠాత్మక పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ డాక్టర్ పి. అరుళ్మొళివర్మన్ తో కలిసి రవి నాయుడు చెస్ ఆడారు. చెస్ పట్ల తన ఆసక్తిని ప్రదర్శించిన ఆయన, యువతలో మేధో వికాసానికి చెస్ వంటి క్రీడలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. రవి నాయుడుతో పాటు ఎస్ఏఏపీ డైరెక్టర్ ఎస్. సంతోష్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వహణ, పోటీల స్థాయిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ డాక్టర్ పి. అరుళ్మొళివర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖదీర్ పాషా, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కె.వి.వి. శర్మ, అధ్యక్షుడు డాక్టర్ సురేష్, కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి చెస్ క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ టోర్నమెంట్ అమరావతి క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో చెస్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.