ఎన్టీఆర్ మహా నాయకుడు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమీర్ పేట లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలుగుజాతి అన్న”గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని అన్నారు. దేశ చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలంటే ముగ్గురు జాతి రత్నాలను తప్పనిసరిగా స్మరించుకోవాలని సీఎం పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ ను మొదటగా గుర్తు చేసుకోవాలని, భూ సంస్కరణల ద్వారా పేదలకు హక్కులు కల్పించిన ఇందిరాగాంధీని తలచుకోవాలని అన్నారు. అలాగే నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ ను స్మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కొందరు విమర్శలు చేస్తున్నారని, అయితే కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. ఇది కేవలం విగ్రహావిష్కరణ మాత్రమే కాకుండా రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాలకు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు వంటి ఎన్నో నాయకులను అందించిన ఘనత ఎన్టీఆర్ దేనని సీఎం అన్నారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ను కూడా గుర్తించి నాయకుడిగా ఎదగడానికి అవకాశం కల్పించింది ఎన్టీఆర్ నే అని తెలిపారు.

సన్నబియ్యం పథకం వెనుక ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తి ఉందని సీఎం పేర్కొన్నారు. పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్ దేనని గుర్తు చేశారు. బలహీన వర్గాలు పాలకులుగా ఎదగడానికి అన్నగారి కృషి ఎంతో కీలకమైందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇందిరమ్మ, ఎన్టీఆర్ స్ఫూర్తి కనిపిస్తోందని సీఎం తెలిపారు. “ఇందిరమ్మ ఒక తరం అయితే.. ఎన్టీఆర్ ఒక శకం” అని వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరి ఆశయాలతోనే ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డలకు హక్కులు కల్పించిన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్ దేనని గుర్తు చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మహిళల సంక్షేమం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ఉపఎన్నికల్లో ప్రజలు అందించిన మద్దతుతోనే ప్రజాపాలన ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగాలని కోరారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను అక్కడికి తీసుకువచ్చి యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.