చెన్నై: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు విజయ్ నేతృత్వంలోని టమిళగ వెట్రి కళగం (TVK) చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే పార్టీతో పొత్తుల అంశంపై పలు పార్టీల నుంచి వేర్వేరు షరతులు, సూచనలు వెలువడుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. టీవీకే పార్టీకి మద్దతు విషయమై కాంగ్రెస్ పార్టీ కీలక షరతు విధించినట్లు సమాచారం. మతతత్వ భావజాలం కలిగిన పార్టీలతో టీవీకే కలవకూడదని, సెక్యులర్ విధానాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. టీవీకే ఆ దిశగా హామీ ఇస్తేనే సహకారంపై ముందుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సీపీఎం పార్టీ టీవీకేకు కేవలం బయట నుంచి మద్దతు మాత్రమే ఇస్తామని, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదని తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే సహకరిస్తామని, కానీ కేబినెట్‌లో చేరే ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీపీఐ పార్టీ మాత్రం టీవీకేకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి సహకరించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు విడమలై చిరుతైగళ్ కచ్చి (VCK) కూడా టీవీకేతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం తమకు కేటాయించాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ స్థానం నుంచి పార్టీ అధినేత తిరుమావళవన్ పోటీ చేయాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలతో టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా తమ తమ రాజకీయ ప్రయోజనాలు, సిద్ధాంత పరమైన అజెండాలను ముందుకు తెస్తున్నాయి. విజయ్ పార్టీ ఈ డిమాండ్లను ఎలా సమన్వయం చేస్తుందన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.