చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదనీ, కానీ తమిళనాడు గవర్నర్ తమిళ ప్రజలను అవమానించేలా వ్యవహరించడం సరైనది కాదని కమల్ హాసన్ పేర్కొన్నారు. మాజీ సీఎం స్టాలిన్ ప్రజల తీర్పును గౌరవించి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. ఆయన రాజకీయ పరిణితిని నేను గౌరవిస్తానని కమల్ హాసన్ తెలిపారు.
కానీ, ఇప్పుడు రాజ్యాంగ బాధ్యతలో ఉన్నవారు కూడా అదే కర్తవ్యాన్ని నెరవేర్చాలని, వారి రాజ్యాంగ కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నామన్నారు. తమిళ ప్రజల తీర్పు లో ఒక పార్టీకి మెజారిటీ రానప్పటికీ, విజయ్ టివికే పార్టీ 108 స్థానాలను గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమే అవుతుందని కమల్ పేర్కొన్నారు. 233 మంది ఎన్నికైన సభ్యులు ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉందనీ, వారి రాజ్యాంగ హక్కులను కాలరాయడం రాష్ట్రానికి అవమానం కలుగుతుందని, ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టంగా పేర్కొన్నారు.
ఎస్.ఆర్. బొమ్మై కేసులో ‘మెజారిటీని రాజ్భవన్లో కాదు, అసెంబ్లీలో నిరూపించుకోవాలి’ అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రస్తావించారు. తాను మాట్లాడుతున్నది పార్టీల రాజకీయాల గురించి కాదని భారత పౌరుడి హక్కుల కోసం తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు.