ఫీజుల నియంత్రణకు మేలోనే డెడ్‌లైన్: కవిత హెచ్చరిక

- కార్పొరేట్ స్కూళ్లపై తీవ్ర విమర్శలు

హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మార్చి కార్పొరేట్ స్కూళ్లు కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఫీజులను తక్షణమే నియంత్రించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య పేరుతో వ్యాపారం జరుగుతుందని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో అమలు చేయని పక్షంలో తమను సెక్రటేరియట్ ముందు కట్టేసి రాళ్లతో కొట్టండి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉందని, నిద్రమత్తులో జోగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే తాము జీవోను డిమాండ్ చేస్తున్నామని కాలయాపన చేయకుండా వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రకరకాల కమిటీల పేరుతో చాలా ఆలస్యం చేస్తున్నారని దీనివల్ల తల్లిదండ్రులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్లు: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ” రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత, విద్యాశాఖ బాధ్యతలు ముఖ్యమంత్రే చేపట్టడం దురదృష్టకరమన్నారు. స్కూల్ ఫీజులు 50 నుంచి 120 శాతం వరకు పెరిగినా ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు అడ్డగోలుగా, నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని కలక్టరేట్ ల ముందు ధర్నా చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం తీసుకున్నది.

మే నెలలో చట్టం తీసుకురావాలి: రాష్ట్ర ప్రభుత్వం మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.

తమిళనాడు, గుజరాత్ మోడళ్ల సూచన: తమిళనాడు తరహాలో శాశ్వత ఫీజుల నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. లేదంటే గుజరాత్ మోడల్ ప్రకారం ప్రాథమిక విద్యకు రూ.15 వేలు, ఉన్నత విద్యకు రూ.25 వేలుగా ఫీజులను ఖరారు చేయాలని ప్రతిపాదించారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వ్యవహారంపై ఆరోపణలు: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 120 శాతం ఫీజుల పెంపు దారుణమని కవిత మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ పాఠశాలలో 30 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. స్కూల్ కమిటీలో ముఖ్యమంత్రి బంధువులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, ప్రముఖులు ఇచ్చిన విరాళాల లెక్కలు లేవని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.11 వేల కోట్లకు చేరాయని, ఎంఎస్-7 జీవో ద్వారా ఈ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని కవిత విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.