జనగణమన దినపత్రిక

స్కైరూట్ యొక్క విక్రం-1 ఆర్బిట్ రాకెట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్:  ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిట్ రాకెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, సంస్థ ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు విక్రం-1 రాకెట్ హార్డ్‌వేర్‌ను ప్రారంభించారు. ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించడంతో ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగశాలకు బయలుదేరుతుంది.

హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ – ఇండస్ట్రియల్ పార్క్‌లో నెలకొల్పిన స్కైరూట్‌కు చెందిన మాక్స్-క్యూ డిజైన్ ఫెసిలిటీలో విక్రం-1 రాకెట్‌ను రూపొందించారు. దేశ అంతరిక్ష పరిశోధనలో ప్రైవేటు రంగంలో రూపొందించి అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే రూపొందించి, అభివృద్ధి చేయడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముందుగా స్కైరూట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై విక్రం-1 ఆర్బిట్ రాకెట్ వివరాలను తెలుసుకుని వారితో మాట్లాడారు. సంస్థ ప్రతినిధులు రాకెట్ పనితీరును వివరించారు. స్కైరూట్ ఫెసిలిటీ సెంటర్ పరిశీలించారు.

“ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్‌ను స్కైరూట్ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ 2022లో తన తొలి రాకెట్‌ను ప్రయోగించగా, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం ఒక అద్భుతమైన విజయం” అని ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఏరోస్పేస్‌ను కీలక వృద్ధి రంగంగా పరిగణిస్తూ, 2047 నాటికి ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవడమే తెలంగాణ లక్ష్యమని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.