జనగణమన దినపత్రిక

రామడుగులో త్వరలో రామరాజ్యం

కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

1

జనగణమన ప్రతినిధి – కరీంనగర్: రామడుగు గడ్డపై త్వరలోనే రామరాజ్యం వస్తుందని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. రామడుగు మండల కేంద్రంలో కురుమ సంఘం, కురుమ యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంకుమార్చన, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామడుగులో కాషాయ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించారు. ఈ లక్ష్య సాధనకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే సహించబోమని పేర్కొన్నారు. హిందువులంతా సుఖసంతోషాలతో ఉండాలని, అన్ని పండుగలను ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యత మరింత పెరగాలని పిలుపునిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. భక్తులతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది.

ఈ కార్యక్రమంలో మేకల ప్రభాకర్, కర్రే అనిల్, వన్నారం అక్షయ్, కారుపాకల నరేష్‌తో పాటు రామడుగు కురుమ యువసేన సభ్యులు, కార్యవర్గ ప్రతినిధులు, మహిళలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.