జనగణమన దినపత్రిక

ఎల్‌నినో ముప్పు… తాగు, సాగునీరు, విద్యుత్‌ పొదుపుపై ప్రత్యేక దృష్టి

- చేతికొచ్చే పంటలను కాపాడేందుకు చర్యలు... అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

3

జనగణమన బ్యూరో – హైదరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తలెత్తే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో సమస్యలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. రాబోయే ఎనిమిది నెలలు కీలకమని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంటలు చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్యుత్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాను సీఎం కార్యాలయ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సినిమా, మీడియా, కళాజాతల ద్వారా ఎల్‌నినో ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దసరా తర్వాత గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాల ప్రకటన, ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని కోరినట్లు సీఎం గుర్తుచేశారు. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీతోపాటు, VB-G RAM G పథకం కింద 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు.

ఎల్‌నినో పరిస్థితులపై త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వార్‌రూమ్‌, టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.