జనగణమన బ్యూరో – హైదరాబాద్: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు తెరలేచింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌కేఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గడ్డంతో కనిపిస్తూ సరికొత్త అవతారంలో ఆకట్టుకున్నారు. బ్లాక్ షర్ట్, ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్‌లో ఆయన స్టైలిష్‌గా కనిపించగా.. చేతిలో ఉన్న భారీ ఆయుధం లుక్‌కు మరింత ఇంటెన్స్‌నెస్‌ను తీసుకొచ్చింది. ప్రశాంతంగా, కూల్‌గా కనిపిస్తూనే పవర్‌ఫుల్ ఆయుధంతో నడుస్తున్న కమల్ హాసన్ లుక్.. సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని పెంచుతోంది.
వైరల్‌గా లుక్ టెస్ట్ గ్లింప్స్
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లుక్ టెస్ట్‌ను తాజాగా నిర్వహించారు. లుక్ టెస్ట్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ సోషల్ మీడియాలో విడుదల కావడంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కమల్ హాసన్ కొత్త లుక్, బాడీ లాంగ్వేజ్, పాత్ర స్వభావంపై అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
అరుణ్ కుమార్ తో తొలిసారి ఆసక్తికర కలయిక
‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్.. బలమైన పాత్రలను ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కించడంలో పేరుపొందారు. ఇప్పుడు ఆయన కమల్ హాసన్ వంటి విలక్షణ నటుడితో కలిసి పనిచేయనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
కమల్ హాసన్ కెరీర్‌లో మరో విభిన్నమైన చిత్రంగా నిలిచేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అనౌన్స్‌మెంట్ పోస్టర్, లుక్ టెస్ట్ గ్లింప్స్ సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.