జనగణమన దినపత్రిక

తైక్వాండోతో క్రమశిక్షణ, ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం

3

జనగణమన ప్రతినిధి – సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ఐ.ఎం.ఏ. హాల్‌లో ఆదివారం సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, తైక్వాండో సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ వేలేటి రాధాకృష్ణ శర్మతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పి. రామ్ మోహన్ హాజరయ్యారు. బెల్ట్ ప్రమోషన్ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బెల్టులు, ధ్రువీకరణ పత్రాలు, మెమొంటోలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు వేలేటి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. తైక్వాండో నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో 2 శాతం రిజర్వేషన్ వంటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదో ఒక క్రీడను తప్పనిసరిగా నేర్పించాలని సూచించారు. క్రీడల ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, జ్ఞానవంతులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణం క్రీడల సంగ్రామంగా నిలుస్తోందని అన్నారు.

జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పి. రామ్ మోహన్ మాట్లాడుతూ.. తైక్వాండోలో సిద్దిపేట విద్యార్థులు ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. మరింత మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించాలని, తద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్‌లో మొత్తం 70 మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు శివరాజు, వరుణ్ రాజు, విజయ్, పృథ్వీరాజ్తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి, బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ ఆర్గనైజర్ రాచకొండ శ్రీనివాస్ సమన్వయంతో నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.