ఎల్‌నినో ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం
- ప్రజలు, రైతులు, రాజకీయ పార్టీలు, మీడియా సహకరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
జనగణమన ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు ప్రజలు, రైతులు, రాజకీయ పార్టీలు, మీడియా సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తీవ్ర ఎండలు, తాగునీటి కొరత, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నందున రాబోయే 8 నుంచి 10 నెలల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నీటి నిల్వలు తక్కువ.. పొదుపు తప్పనిసరి
రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లో 72 శాతం, గోదావరి బేసిన్‌లో 40 శాతం మేర నీటి నిల్వలు తగ్గాయని సీఎం వెల్లడించారు. సాధారణంగా 460 టీఎంసీల నీరు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 209 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, వర్షపాతంలో 23 శాతం లోటు నమోదైందని వివరించారు. రానున్న రోజుల్లో తాగునీటి సరఫరా ప్రధాన సవాల్‌గా మారే ప్రమాదం ఉందన్నారు. “దేనినైనా కొనుగోలు చేయవచ్చు.. కానీ నీటిని కొనుక్కోలేం” అని పేర్కొన్న సీఎం, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బండ్లు, కార్లు కడగడం వంటి అవసరాలకు నీటిని వృథా చేయవద్దని, ప్రతి చుక్కను ఆదా చేయాలని సూచించారు.
యాసంగిలో వరి సాగు తగ్గించాలి
రాష్ట్రంలో సుమారు 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, మరో 13 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయని సీఎం తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వచ్చే యాసంగిలో వరి సాగును తగ్గించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి వరి సాగు చేస్తే నారుమళ్ల దశలోనే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరో 20 రోజుల్లో వానాకాలం పంటలు కోతకు వచ్చే అవకాశం ఉన్నందున చేతికొచ్చిన పంటలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగే ప్రమాదముందని నివేదికలు అందాయని, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పంట నష్టపోయిన, నీటి కొరతతో సాగు చేయలేని రైతులను కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు.
20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
అక్టోబర్‌లోనే మార్చి నెలలో ఉండే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని సీఎం అన్నారు. సాధారణంగా 15 వేల మెగావాట్లుగా ఉండాల్సిన విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరిందని, రాష్ట్రంలోని సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు పనిచేస్తున్నాయని వివరించారు. ఈ రోజు 20,003 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైందని తెలిపారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ మంత్రి, అధికారులను అభినందించారు. మార్కెట్‌లో ఎంత ధరకు లభించినా విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం సమన్వయంతో తక్కువ ధరకు విద్యుత్ అందించాలని సూచించారు.
ఉపాధి హామీ పనులకు ప్రాధాన్యం
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో 25 వేల మంది పనుల్లో పాల్గొనగా, ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పాల్గొంటున్నారని చెప్పారు. చెరువులు, కుంటల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందించడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య, ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.
దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి సహకారం పొందే అంశంపై చర్చిస్తున్నామని సీఎం తెలిపారు. దసరా తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అనంతరం తన నాయకత్వంలో అఖిలపక్ష బృందంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాతాలు నిర్వహిస్తామని, సినీ నటులు, క్రీడాకారులు, కళాకారుల సహకారం తీసుకుంటామని చెప్పారు. మీడియా కోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు ప్రజలను చైతన్యపరిచేలా వ్యాసాలు రాయాలని కోరారు. కోవిడ్ సమయంలో దేశమంతా కలిసికట్టుగా పనిచేసిన స్ఫూర్తితోనే ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలని సీఎం పిలుపునిచ్చారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ, రైతులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమష్టి కృషితో ఎల్‌నినో సవాల్‌ను అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.