ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
- 45 ఎకరాలు ఎక్కడున్నాయో తేల్చాలని అధికారులకు ఆదేశం.. అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక కాలనీ
జనగణమన బ్యూరో – హైదరాబాద్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధికారులు చేపట్టిన భూ సర్వే వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా.. రెవెన్యూ అధికారుల తాజా సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో రికార్డుల్లో ఉన్న మొత్తం విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో గుర్తించిన భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
45 ఎకరాలపై స్పష్టత ఇవ్వాలి
సర్వే నంబర్ 325లో మిస్ అయినట్లు గుర్తించిన 45 ఎకరాల భూమి ఎక్కడుందో సమగ్రంగా తేల్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భూమి హద్దులు, రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి పూర్తి వివరాలను సిద్ధం చేయాలని సూచించారు. భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. భూమి సరిహద్దుల్లో భూములు కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా రెవెన్యూ రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
అర్హులైన రైతులకు భూముల పంపిణీ
సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని గుర్తించి, నిబంధనల ప్రకారం స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. భూములపై పూర్తి స్థాయి సర్వే, రికార్డుల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక కాలనీ
ఇదే సర్వే నంబర్‌లోని భూమిలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అవసరమైన మౌలిక వసతులతో సమగ్రంగా కాలనీని అభివృద్ధి చేయాలని సూచించారు. కాలనీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర సకల సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ విభాగానికి అప్పగించాలని సూచించారు. వచ్చే జూన్ 2లోగా తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.