జనగణమన బ్యూరో – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) అందించే ప్రతిష్ఠాత్మక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు–2026ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (IHM) శ్రీ శక్తి దక్కించుకుంది. హాస్పిటాలిటీ సంస్థ (ప్రైవేట్) విభాగంలో ఈ అవార్డును పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సెప్టెంబర్ 26న హైదరాబాద్ శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో ప్రదానం చేశారు.
తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య విద్యకు IHM శ్రీ శక్తి అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం అందించారు. అత్యుత్తమ ఆతిథ్య విద్య, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్యాంశాలు, రాష్ట్రంలో పర్యాటక ప్రోత్సాహానికి సంస్థ చేస్తున్న కృషిని అవార్డు గుర్తించింది.
సంస్థ నుంచి శిక్షణ పొందిన వేలాది మంది నిపుణులు దేశ, విదేశాల్లో ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్నారని యాజమాన్యం తెలిపింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతులైన ఆతిథ్య నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ పురస్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొంది. తెలంగాణ పర్యాటక శాఖకు కృతజ్ఞతలు తెలిపింది.