జనగణమన బ్యూరో – హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ నిమ్స్ (నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అత్యాధునిక వైద్య సేవల అందింపులో మరో కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిమ్స్ వైద్య బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. నిమ్స్ ఈ విజయాన్ని సాధించడం రాష్ట్ర వైద్య రంగానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సేవల బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం సాకారమవుతోందని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ప్రవేశపెట్టి పేదలకు కూడా నాణ్యమైన చికిత్స అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. నిమ్స్‌లో నిర్వహించిన రొబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రోగులకు ఉచితంగా అందించడం విశేషమని సీఎం పేర్కొన్నారు. ఖరీదైన రొబోటిక్ శస్త్రచికిత్సలను ఆర్థిక భారం లేకుండా ప్రజలకు అందించడం ప్రభుత్వ వైద్య రంగ విజయానికి నిదర్శనమని అన్నారు.
ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ద్వారా దేశంలో ప్రభుత్వ వైద్య సంస్థలలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా నిమ్స్ అత్యాధునిక వైద్య సేవల విస్తరణలో ముందుండి మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి మైలురాళ్లు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిమ్స్ ఆదర్శవంతమైన సంస్థగా కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైద్య రంగంలో సేవలందిస్తున్న ప్రతి వైద్యుడు, నర్సు, సాంకేతిక నిపుణుడు, సహాయక సిబ్బంది కృషిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడంలో వారి అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.