జనగణమన దినపత్రిక

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ రాక

– బీజేపీ భారీ సన్నాహాలు

హైదరాబాద్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. సభ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

ప్రత్యేకంగా జన సమీకరణపై పార్టీ దృష్టి సారించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు కేటాయిస్తూ పార్టీ యంత్రాంగాన్ని సక్రియం చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు రానున్న రాజకీయ పరిస్థితులపై కూడా స్పష్టమైన సందేశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని పర్యటనను రాజకీయంగా మలచుకునే దిశగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మే 10న జరగనున్న ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశముంది.

Leave A Reply

Your email address will not be published.