జనగణమన దినపత్రిక

పాలమూరు–రంగారెడ్డి పనులు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమే!

- ప్యాకేజీ–3లో మట్టి తొలగిస్తే నీటి తరలింపునకు అడ్డంకులుండవు : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

1

జనగణమన బ్యూరో – హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌ను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. నార్లాపూర్ రిజర్వాయర్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని తరలించే ఏర్పాట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. కేఎల్‌ఐ పథకంలో తక్కువ సామర్థ్యంతో కాల్వలు నిర్మించడం వల్ల రైతాంగానికి పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూర్చేందుకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనుసంధానించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నార్లాపూర్‌ నుంచి ఎల్లూరుకు, ఏదుల నుంచి బుద్ధారం కాలువకు, వట్టెం రిజర్వాయర్‌ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువకు లింకులు ఏర్పాటు చేశామని వివరించారు. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేసిన తూమును కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరడంతోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్యాకేజీ–3లో మట్టి తొలగించాలి

శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికీ నీరు అందుబాటులో ఉందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్యాకేజీ–3లో అడ్డంకిగా ఉన్న మట్టిని తొలగించి నీటిని పారించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న పంపులను నడిపేందుకు ఇబ్బంది లేదని, పది పంపులను ఒకేసారి నడిపే విషయంలోనే సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద పంపులు సిద్ధంగా ఉన్నాయని, నీటిని కరివెన వరకు తరలించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి రిజర్వాయర్‌లో ఐదు టీఎంసీల నీటిని నింపవచ్చని, మిగిలిన పనులను వచ్చే ఏడాది పూర్తి చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

మూడేళ్లుగా పనులు ఎందుకు నిలిపివేశారు?కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు నిలిచిపోయాయని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాలువల టెండర్లను ఎందుకు రద్దు చేశారని, మూడేళ్లుగా తిరిగి టెండర్లు ఎందుకు పిలవలేదని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను రాష్ట్ర సాగునీటి సలహాదారులుగా నియమించుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ గత మూడేళ్లుగా కోరుతున్నప్పటికీ, మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశంపై ఎందుకు స్పందించలేదని విమర్శించారు.

ప్రజా ప్రయోజనాల కోసమే పోరాటం

కాంగ్రెస్ పాలనలో గతంలో జరిగిన అన్యాయాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరిదిద్దేందుకు ప్రయత్నించామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. జూపల్లి కృష్ణారావుకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలే తప్ప పాలమూరు ప్రజల ప్రయోజనాలపై శ్రద్ధ లేదని విమర్శించారు. అధికారం ఉన్నా లేకపోయినా పాలమూరు ప్రజలతో పాటు తెలంగాణ ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

అధికారం శాశ్వతం కాదని, ప్రజల ప్రయోజనాలే శాశ్వతమని పేర్కొన్న ఆయన.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారి సంక్షేమం కోసం వినియోగించుకునే నాయకులను ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తన సవాల్‌కు కట్టుబడి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యేలా సహకరించాలని నిరంజన్‌రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.